ఫిబ్రవరిలో సీఎం రేవంత్ బహిరంగ సభ

నల్గొండ, ఏపీబీ న్యూస్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి చట్టాన్ని రద్దు చేయడం పేదల పట్ల కేంద్రంలోని బీజేపీ మరణశాసనం చేసిందని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు పున్నకైలాష్‌ నేత అన్నారు. శనివారం నల్లగొండలోని యాదవ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనాడు పేద ప్రజల కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల ఆత్మగౌరవం కోసం వలసల నిరోదానికి ఉపాధి హామి పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. దాంతో పేదలకు 100 రోజుల పని కల్పించడం వల్ల వలసలు తగ్గిపోవడంతో గ్రామంలోనే ఆత్మగౌరవంతో బతికారన్నారు. గ్రామాబివృద్దికి వారు ఎలాంటి పనులైతే అవసరమో ఆ పనులను ఉపాది హామి ద్వారా చేసుకున్నారన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాన్ని మార్చి పేదలకు మరణ శాసనం రాసిందని దుయ్యబట్టారు. కొత్తగా తీసుకొచ్చిన వీబీజీరామ్‌జీ చట్టంలో పని దినాలు పెరిగినా కూలీలకు ప్రయోజనం లేదన్నారు. వారు చెప్పిన పనులు చేయాలి తప్ప గ్రామంలో అవసరమైన పనులు చేసుకునే అవకాశం లేదన్నారు. గతంలో ఏడాది పొడవునా ఉపాధి హామి పనులు నిర్వహించుకునేవారని ఇప్పుడు 60 రోజుల పనులు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. గతంలో గ్రామంలో ఎలాంటి పనులు కావాలో గ్రామ సభ ద్వారా ఎంపిక చేసి నిర్ణయించేవారని ఈ చట్టం ద్వారా ఎలాంటి పనులు చేయాలో డిల్లీ ప్రభుత్వంపై ఆదారపడాల్సి ఉంటుందన్నారు. గతంలో నూటికి నూరు శాతం కేంద్రం నిధులు ఇస్తే ఇప్పుడు 60 శాతం ఇచ్చి 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెబుతుందన్నారు. డిజిటల్‌ పద్దతిలో పనుల పర్యవేక్షణ చేయాల్సి ఉందని ఇది ప్రస్తుతం అన్ని గ్రామాల్లో అందుబాటులోకి రాలేదన్నారు. దీని ద్వారా ఉద్యోగుల తొలగింపుతో పాటు నిరుద్యోగ సమస్య పెరిగిపోయే అవకాశం ఉందన్నారు. పేదల బతుకులను చిందర వందర చేయడం తప్ప మరోటి కాదన్నారు.

పనులు దొరక్క గ్రామీణ ప్రాంతాల ప్రజలు, పట్టణాలకు పోతే గ్రామాల్లో ఉన్న ఆస్తులను అదానీ, అంబానీలకు అప్పచెప్పాలని చూస్తుందని ఇది వ్యతిరేకిస్తున్నామన్నారు. మోడి చాయ్‌ వాలా అని చెప్పుకుని పేదల వ్యతిరేక పనులు చేస్తు పెద్దల కోసం నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఆరోపించారు. ఈచట్టం వల్ల గ్రామ పంచాయతీ అధికారాలు తగ్గిపోతాయన్నారు. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడటానికి సిద్దం కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ చట్టం ఉపసంహరించుకుని పాత ఉపాధి హామి చట్టం పునరుద్దరించాలని డిమాండ్‌ చేశారు. కొత్తగా తెచ్చిన వీబీజీ రామ్‌జీ చట్టాన్ని వ్యతిరేకిస్తు ఈ నెల 20 నుంచి 30 వరకు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి చట్టానికి వ్యతిరేకంగా తీర్మాణాలు చేయాలని నిర్ణయించామన్నారు. సర్పంచ్‌లు, ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సీలు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ తీర్మాణాల కాపిలను తెలంగాణ ఎంపీలు పార్లమెంట్‌లో పెట్టి చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తారన్నారు.

dcc president punna kailash netha press meet

ఫిబ్రవరి నెలలో ఉమ్మడి జిల్లాలో కొత్తగా తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా బారీ బహిరంగ సభ చేయనున్నట్లు, ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ చామల శ్రీను, ఎం.డి. ముంతాజ్‌ అలీ, కన్నారావు, చింతమల్ల వెంకటయ్య, గౌతమ్, పగిల్ల శివ, వెంకట్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Share
Share