- చెరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహోత్సవాల ఏర్పాట్లు ఘనంగా చేయాలి: ఎంపీ చామల
- రూ.100 కోట్లతో టెంపుల్ మాస్టర్ ప్లాన్
- త్వరలో సీఎం రేవంత్ చేతుల మీదుగా పనులు ప్రారంభం: ఎమ్మెల్యే వీరేశం
నకిరేకల్, ఏపీబీ న్యూస్: ఈనెల 23 నుండి 30 వరకు నిర్వహించనున్న చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే వేముల వీరేశం, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, జిల్లా అధికారులతో కలిసి చెరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులను అంచనా వేసి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా చెరువుగట్టు పై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, కంట్రోల్ రూమ్ కి వచ్చే ఫిర్యాదులు అన్నింటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. చేరువుగట్టు దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, హైదరాబాద్ తో పాటు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారని, అంతేగాక భక్తులు నిద్ర చేయడం ఇక్కడ అలవాటుగా ఉందని, అందువల్ల భక్తులకు అవసరమైన ఏర్పాట్లలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలన్నరు.

బ్రహ్మోత్సవాలపై విస్తృత ప్రచారం కల్పించాలని, హయత్ నగర్ నుండి చెరువుగట్టు వరకు ప్రత్యేక బస్సులు నిర్వహించాలని ఆర్టీసీ అధికారులతో కోరారు. అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ట్రాఫిక్ నియంత్రించాలని, మద్యం, మత్తు పదార్థాల వంటివి లేకుండా చూడాలని, పార్కింగ్ లో భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. దేవాలయం అభివృద్ధికి అవసరమైతే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ దేవాలయానికి స్వయం సమృద్ధి ఉన్నందున భవిష్యత్తులో ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు.
ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాదగిరిగుట్ట తర్వాత అతిపెద్ద దేవాలయం చెరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం అని అన్నారు. ప్రతి అమావాస్యకు 50 వేల వరకు భక్తులు ఇక్కడ నిద్ర చేస్తారని, ఏళ్ల తరబడి ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నదని, అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరు కలిసి ఈ సంవత్సరపు బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వంద కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగిందని, వచ్చే నెలలో ఈ పనులకు సీఎం రేవంత్ రెడ్డి ద్వారా శంకుస్థాపనకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రతి సంవత్సరం దేవాలయం ద్వారా 15 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈనెల 23 నుండి జరిగే శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి సమస్యలు రాకుండా బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. సిసిటీవీలను కమాండ్ కంట్రోల్ రూమ్ కు టై అప్ చేయాలని, గుట్ట పైన, పార్కింగ్ వద్ద హెల్ప్ డేస్క్ ఏర్పాటు చేయాలని, కింది నుండి దేవాలయానికి వెళ్లే రహదారి ఇబ్బందులు లేకుండా గుంతలు పూడ్చాలని అన్నారు.