- ఆర్ అండ్ బి ద్వారా రూ.200 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు
- రూ.700 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం
- ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రూ.12 కోట్లతో పాఠశాల నిర్మాణం
నల్లగొండ, ఏపీబీ న్యూస్: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ గా మారనున్న నేపథ్యంలో భవిష్యత్తులో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పట్టణంలో ఆర్ అండ్ బి ద్వారా 200 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని, ఇంకో రూ.700 కోట్లతో భూగర్భ డ్రైనేజీ నిర్మిస్తున్నామని, నల్గొండను హైదరాబాద్ కు మోడల్ గా చేయాలనే సంకల్పంతో ఉన్నామని మంత్రి తెలిపారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 12 కోట్లతో పట్టణంలోని బొట్టుగూడ ప్రాథమిక పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడం జరిగిందని, త్వరలోనే ఈ పాఠశాల ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

గురువారం ఆయన నల్గొండ జిల్లా, చర్లపల్లి వద్ద ఉన్న విపస్య పాఠశాలలో నిర్వహించనున్న 2 రోజుల అంతర్ పాఠశాలల క్రీడా పోటీలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంలో భాగంగా ఒక్కొక్కటి 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నదని, నల్గొండలో ఎస్ఎల్బీసీ వద్ద నిర్మిస్తున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల భవనం నిర్మాణంలో ఉందని తెలిపారు. తరగతి గదులు, డార్మెంటరీ, డైనింగ్, కిచెన్, క్రికెట్ ఫుట్బాల్ స్టేడియంలతో ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగ్గా వీటిని నిర్మిస్తున్నామని, వచ్చే సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభం అవుతాయని మంత్రి తెలిపారు. పాఠశాల/ కళాశాల వదిలిన వెంటనే ఉద్యోగం వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం వీటిని రూపొందిస్తున్నదని, ప్రతి విద్యార్థి జీవితంలో రాణించేలా చదువుకోవాలని కోరారు.