- నో హెల్మెట్..నో పెట్రోల్ నిబంధన పక్కాగా అమలు
- హెల్మెట్‌తోనే పెట్రోల్ పోస్తామని చెప్తున్న బంకుల యజమానులు
నల్లగొండ,ఏపీబీ న్యూస్: నల్లగొండ పట్టణంలో ఒక్కసారిగా హెల్మెట్ల సేల్ పెరిగింది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ఆదేశాలు హెల్మట్ల వ్యాపారులకు భారీగా కలిసొచ్చింది. షాపుల్లో, బైక్ షోరూమ్‌లు నిల్వ ఉన్న స్టాక్ అంతా రోడ్డు పైన అమ్మకానికి పెట్టారు. జాతీయ రోడ్డు ప్రమాదాల నివారణ కార్య క్రమంలో భాగంగా కొద్దిరోజుల క్రితం జిల్లా ఎస్పీ నో హెల్మట్..నో పెట్రోల్ అనే నిబంధన అమల్లోకి తెచ్చారు. మొదటి రెండు రోజులు ఎస్పీ ఆదేశాలను అంతగా పట్టించుకోలేదు. కానీ పెట్రోల్ బంక్ వ్యాపారులకు కచ్చితమైన ఆదేశాలు వెళ్లడంతో వాహనదారులు హెల్మెట్ల కొనక తప్పడం లేదు. హెల్మట్‌తో వస్తేనే పెట్రోల్ పోస్తామని చెప్పడంతో వాహనదారులు హెల్మట్ల కోసం పరుగులు తీస్తున్నారు.

గురువారం నల్లగొండలో చాలా మంది హెల్మట్లు పెట్టుకుని బైక్‌లు నడుపుతున్న దృశ్యాలు కనిపించాయి. ఇన్నాళ్లు రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఎన్ని రకాల ఆంక్షలు విధించినప్పటికీ వాహనదారులు తేలిగ్గా తీసుకున్నారు. కానీ ఏకంగా పెట్రోల్‌కే ఎసరు పెట్టడంతో ఇప్పుడు వారంతా దారికొచ్చారు. కాకపోతే దీన్నే అవకాశంగా భావించిన వ్యాపారులు హెల్మట్ల రేట్లను అమాంతంగా పెంచారు. ఒక్కోటి వెయ్యి నుంచి రెండు, మూడు వేల వరకు చెప్తున్నారు. అన్ని పైసలు పెట్టి కొనడం కష్టమని, రేట్లు తగ్గించని కోరుతున్నా వినడం లేదు. పైగా హెల్మట్లు అమ్మేందుకు ఎన్జీ కాలేజీ జంక్షన్, క్లాక్ టవర్ జంక్షన్‌తో సహా, పలు జంక్షన్ల వద్ద కుప్పులుగా పోసి అమ్మకాలు జరుపుతున్నారు.