కారు​ పిలుస్తోంది…రండి! ఎన్నికల ఖర్చు తామే భరిస్తాం: బీఆర్ఎస్​

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్​: మున్సిపల్​ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. పార్టీల గుర్తులతో జరుగుతున్న ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బీఆర్​ఎస్​ పార్టీ అభ్యర్థులకు ఆహ్వానం పలుకుతోంది. కారు పార్టీలో చేరితే చైర్మన్​ పదవి తో సహా, కౌన్సిలర్​ టికెట్​ కూడా ఇస్తామని ఆఫర్​ ప్రకటిస్తున్నారు. అంతేగాక బలమైన లీడర్లు ఎవరైనా వస్తే ఎన్నికల ఖర్చు కూడా తామే భరిస్తామని హామీ ఇస్తున్నారు. నల్లగొండ, మిర్యాలగూడ, దేవ రకొండ, కోదాడ, భువనగిరి, హుజూర్​నగర్, సూర్యాపేట మున్సిపాలిటీల్లో ఈ తరహా ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మిర్యాలగూడ లో మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్​రావు కొడుకు సిద్ధార్థ కాంగ్రెస్​ పార్టీకి ఝలక్​లు ఇస్తున్నారు. కాంగ్రెస్​ వార్డు ఇన్​చార్జిలను బీఆర్​ఎస్​ లోకి చేర్చుకునే కార్యక్రమాన్ని స్పీడప్​ చేశారు. అంతేగాక మున్సిపాలిటీల్లో పార్టీ గెలుపుకు అవసరమైతే ఆస్తులైనా అమ్ముకుంటాం గానీ, పదవులు వేలం పాట పెట్టమని కాంగ్రెస్​ పార్టీకి గట్టి కౌంటర్​ ఇచ్చారు. దీంతో మిర్యాలగూడ కాంగ్రెస్​లో గుబులు మొదలైంది. మాజీ చైర్మన్​ తిరునగరు భార్గవ్​ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు.

thirunagar bhargav

ఈసారి చైర్మన్​ సీటు జనరల్​కు రిజర్వేషన్​ అయితే రెడ్డి సామాజికవర్గాన్ని రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్​ సన్నాహాలు చేస్తోంది. సీనియర్​ నేత అల్గుబెల్లి అమరేందర్​ రెడ్డి తెరవెనక చక్రం తిప్పుతున్నారు. ఆయనతో పట్టణానికి చెందిన పలువురు నేతలు హైదరాబాద్ కేంద్రంగా పావులు కదుపుతున్నారు. భార్గవ్​ను పార్టీలో చేర్చుకోవడం అప్పట్లో ఎమ్మెల్యేకు ఎంత మాత్రం ఇష్టం లేదు. కానీ సీనియర్ల అండతో ఏదో విధంగా సర్ధుకుపోతున్నారు. మున్సిపల్​ చైర్మన్​ అవకాశం రాకపోయినప్పటికీ తన వర్గానికి కౌన్సిలర్​ టికెట్లు ఇప్పించుకోవడంలో భార్గవ్​ ఎంతమేరకు సక్సెస్​ అవుతారనేది ఇప్పటికైతే ప్రశ్నార్ధకమే. పార్టీ మారొచ్చిన నేతలతో కాంగ్రెస్​ కేడర్​ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒక వేళ వలస నేతలకు కాంగ్రెస్​లో కౌన్సిలర్​ టికెట్​ ఇవ్వకుంటే వారందరిని తిరిగి బీఆర్​ఎస్​లో చేర్చుకునేందుకు మాజీ ఎమ్మెల్యే భాస్కర్​ రావు డోర్లు ఓపెన్​ చేశారు. భేషజాలను పక్కనపెట్టి పార్టీలోకీ రావాలని భావిస్తే నిరభ్యంతరంగా చేర్చుకుంటామని, కౌన్సిలర్​ టికెట్లు కూడా ఇస్తామని ఆఫర్​ ప్రకటించారు.

అర్బన్​ లీడర్లకు ఇదే ఆఖరు..

అర్బన్ లీడర్లకు మున్సిపల్​ ఎన్నికలతోనే పొలిటికల్​ కేరీర్​ ముడిపడి ఉంటుంది. సర్పంచ్​, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తరహాలో ఒక చోట మిస్సైతే మరొక చోట అవకాశం లభిస్తుందనే నమ్మకం మున్సిపాలిటీలో ఉండదు. కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​లోని వలస నేతలకు బెంగ పట్టుకుంది. మొదటి నుంచి పార్టీనే నమ్ముకున్న కేడర్​కు కౌన్సిలర్​ టికెట్లు ఇవ్వాలని పార్టీ హైకమాండ్​ ఇప్పటికే తీర్మానించింది. ఆ మేరకు ఎమ్మెల్యేలకు, మంత్రులకు సంకేతాలు కూడా ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరినవారే. కానీ ఇప్పుడు వాళ్లలో ఎంత మందికి టికెట్​ లభిస్తుందనే నమ్మకం లేదు. ఒక వేళ రిజర్వేషన్లు తారుమారైతే తమ కుటుంబ సభ్యులను పోటీలో దింపేందుకు వెనకాడమని చెప్తున్నారు. ఎటొచ్చి కాంగ్రెస్​లో టికెట్ల లొల్లి తీవ్రంగానే కనిపిస్తోంది. దీన్నే అదునుగా భావించిన మాజీ ఎమ్మెల్యేలు అవకాశం కోసం కాసుకూర్చున్నారు. బలమైన అభ్యర్థులు లేనందున కాంగ్రెస్​లో చేరిన బీఆర్​ఎస్ కేడర్​ మళ్లీ యూటర్న్​ తీసుకొని వస్తే చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు.

nallamothu siddhartha

గ్రూపు గొడవలతోనే చిక్కు..

అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆతర్వాత చాలా మంది కౌన్సిలర్లు, చైర్మన్​లు కాంగ్రెస్​లో చేరారు. వీళ్లలో ముఖ్యనేతల అనుచరులు కూడా ఉన్నారు. మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి వర్గానికి చెందిన కౌన్సిలర్లు, చైర్మన్​లు నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ, నందికొండ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్​లో చేరారు. కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్​ వర్గం కాంగ్రెస్​లో చేరగా, మరికొందరు సొంత కుంపటి పెట్టుకున్నారు. నల్లగొండలో వైస్​ చైర్మన్​ అబ్బగోని రమేష్ ​గౌడ్​తో సహా, అనేక మంది కౌన్సిలర్లు కాంగ్రెస్​లో చేరారు. మిర్యాలగూడలో చైర్మన్​ తిరునగరు భార్గవ్​, హుజూర్​నగర్​, సూర్యాపేట, భువనగిరి, చౌటుప్పుల్​లో చైర్మన్​లు, కౌన్సిలర్లు బీఆర్​ఎస్​లో పదవులు పొంది, కాంగ్రెస్​లో చేరారు. అప్పుడన్న ఎమ్మెల్యేలతో గొడవలు, మనస్పర్థలు, ఒత్తిళ్లు భరించలేకపోయారు. దీన్నే అదునుగా భావించిన కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు, మంత్రులు అసెంబ్లీ ఎన్నికల్లో తమ గెలుపు కోసం పార్టీలో చేర్పించుకున్నారు. కానీ ఇప్పుడు అదే సమస్యగా మారుతోంది.

Share
Share