- ఇండస్ట్రియల్ జీఎం, జడ్పీ సీఈఓ, డీఎం సివిల్ సప్లై, డీపీఓలు ఆకస్మిక బదిలీ
- తృటిలో తప్పించుకున్న డీఈఓ? గాడితప్పుతున్న ప్రభుత్వ శాఖల పనితీరు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో అధికారుల పనితీరు బాగోలేదని గడిచిన 14 నెలల్లో నలుగురు ఆఫీసర్ల పైన వేటు పడింది. కలెక్టర్ ఇలా త్రిపాఠి పనిచేసిన 14 నెలల్లో వివిధ కారణాల దృష్ట్యా పలు కీలక శాఖల్లో అధికారుల వ్యవహారం వివాదస్పదంగా మారడంతో పై ఆఫీసర్లకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో కలెక్టర్ స్వయంగా కమిషనర్ ఆఫీస్ కు సరెండర్ చేయగా, ఒకరిద్దరు ఇక్కడ అధికార రాజకీయ ఒత్తిళ్లు భరించలేక వెళ్ళిపోయారు. వాళ్ళల్లో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వి. కోటేశ్వరరావు, సివిల్ సప్లై జిల్లా మేనేజర్లు, గోపికృష్ణ, హారీష్, జడ్పీసీఈఓ ప్రేమ్కరణ్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి జిల్లా నుంచి ఆకస్మికంగా బదిలీ అయ్యారు. ఎవరు ఎందుకు బదిలీ అవుతున్నారో కూడా తెలియకుండానే అంతా గోప్యంగా జరిగిపోయింది.
డీఈఓ భిక్షపతిని కూడా జిల్లా నుంచి పంపించే ప్రయత్నాలు జరిగాయి. అక్రమ డెప్యుటేషన్లు, స్కూళ్ల పనితీరు బాగోలేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు కట్టబెట్టారనే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో డీఈఓను సరెండర్ చేసే ప్రయత్నాలు జరిగాయి. కానీ ఈ జిల్లాలో పనిచేసేందుకు ఎవరూ ఆసక్తిచూపట్లేదని, మరో గత్యంతరం లేదని, ఆయన్నే కొనసాగించిక తప్పదని పై ఆఫీసర్లు స్పష్టం చేసినట్టు తెలిసింది.
గాడి తప్పిన అడ్మినిస్ట్రేషన్…
నాలుగు శాఖలకు బలమైన ఆఫీసర్లు లేకపోవడంతో పరిపాలన గాడి తప్పింది. కొత్తగా వచ్చిన కలెక్టర్ చంద్రశేఖర్ దృష్టి సారిస్తే పాలన గాడిన పడే పరిస్థితులు లేవని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లా కేంద్రాల్లో ఉండాల్సిన ఆఫీసర్లు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించడం, ఉద్యోగులు సమాయాపాలన పాటించకపోవడం వల్ల ప్రజా పాలనకు అవరోధరంగా మారింది. క్షేత్రస్థాయిలో కూడా ఏం జరుగుతోందో కూడా ఎవరికీ పట్టింపులేకుండా పోయింది. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల పైన సమీక్షలు లేకపోవడం కూడా మైనస్.

ఆఫీసర్ల పైన ఒత్తిళ్లు..
రాజకీయ ఒత్తిళ్లు మితిమీరిపోవడంతోనే ఆఫీసర్లు పని చేయలేని పరిస్థితి నెలకొందని ఉద్యోగులు అంటున్నారు. ఇటీవల జిల్లా పరిషత్లో ఉద్యోగుల మధ్య నెలకొన్న విభేదాలు రచ్చకెక్కాయి. డీపీఓ కార్యాలయం పైన పనిభారం పెరిగింది. పాలన పైన పట్టున్న ఆఫీసర్లు లేకపోవడంతో పంచాయతీ కార్యాలయంలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. డీఎంహెచ్ఓ ఆఫీసులో సిబ్బంది సక్రమంగా విధులకు రాకపోవడం, డీఎంహెచ్ఓ పనివేళల్లో కాకుండా సాయంత్రం వేళల్లో కార్యాలయానికి వచ్చిపోతుండటం వల్ల దీన్నే అదునుగా భావించిన ఉద్యోగులు సమయాపాలన పాటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.