నల్లగొండ, ఏపీబీ న్యూస్: మున్సిపల్ కమిషనర్లు పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. శనివారం ఉదయం అయన నల్గొండ మున్సిపాలిటీలో పర్యటించి పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. వార్డ్ నెంబర్ 28 (శ్రీ కృష్ణ నగర్) లో శానిటేషన్ సిబ్బంది చేస్తున్న మురికి కాలువల శుభ్రం, పారిశుధ్య పనులను పరిశీలించారు. మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, వీధులలో, రోడ్లపై ఎవరు చెత్త వేయకుండా చూడాలని, ఎవరైనా చెత్త వేస్తే జరిమానా విధిస్తామని చెప్పాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు. వార్డు ప్రజలతో ఆయన ముఖాముఖి మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణ ఎలా ఉందని? మిషన్ భగీరథ తాగునీరు సక్రమంగా వస్తున్నాయా లేదా? అని వాకబు చేశారు.

అనంతరం కమిషనర్ తో మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, అలాగే మిషన్ భగీరథ త్రాగునీటి సరఫరాపై శ్రద్ధ వహించాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ యాదవ సంఘం భవనం వెనుక ఉన్న మోతికుంట బండ్ పునరుద్ధరణ కు అమృథ్-2 పథకం కింద నిధులు మంజూరు కాగా బండ్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ఉన్నారు.
