ఒక వార్డులోని కుటుంబ సభ్యులందరినీ అదే వార్డులో ఉండేలా చూడాలి: కలెక్టర్​

నల్లగొండ, ఏపీబీన్యూస్​: మున్సిపాలిటీలలో వార్డుల వారీగా ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాను పునః పరిశీలన  చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం ఆయన  తన చాంబర్ లో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాలో ఏలాంటి తప్పులు లేకుండా నూటికి నూరు శాతం పారదర్శకంగా ఉండాలని, అందువల్ల ఈ నెల 1 న మున్సిపల్  వార్డుల వారిగా ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాను మున్సిపల్ కమిషనర్లు, బి ఎల్ ఓలు, వార్డ్ ఆఫీసర్లు పునః పరిశీలన చేయాలని చెప్పారు.

ప్రస్తుతం ప్రచురించిన ఓటరు జాబితా ఈసీఐ ఆదేశాలకు మేరకు తయారు చేసిన ఓటరు జాబితాలో పురుష, మహిళ ఓటర్లు సరిపోయేలా ఉండాలని అన్నారు. ఆయా వార్డుల వారిగా రూపొందించిన ఓటరు జాబితాలో ఓటర్ల వివరాలు ఇంటి నెంబర్ల ప్రకారం ఉన్నాయో లేదో చూడాలన్నారు. ఒక వార్డులోని కుటుంబ సభ్యులు అదే వార్డులో ఉండేలా చూడాలని, ఒక వార్డులో నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ ఓటర్లు లేకుండా చూడాలని, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గుర్తించిన రిటర్నింగ్ అధికారులు చురుకుగా, పూర్తి అవగాహనతో ఉండేవారిని  ఎంపిక చేయాలని,మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అవసరమైన ఇండెలిబుల్ ఇంక్  కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని,  ప్రస్తుతమున్న ఓటరు జాబితాలో ఎట్టి పరిస్థితులలో సవరణకు అవకాశం లేదన్న  విషయాన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు, ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని ఆయన వెల్లడించారు. మున్సిపాలిటీలలో ప్రచురించిన ఓటరు జాబితా పై ఈనెల 5 వరకు అభ్యంతరాలను స్వీకరించాలని కలెక్టర్ సూచించారు.ఓటరు జాబితాకు సంబంధించి మున్సిపాలిటీలలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు.

Share
Share