రైతుల దగ్గర సరిగ్గా సెల్ ఫోన్లు లేవు యూరియా యాప్ ఎలా వాడుతారు?

సూర్యాపేట, ఏపీబీ న్యూస్​: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధుల కేటాయింపులో గత , ప్రస్తుత ప్రభుత్వాలు రెండూ అన్యాయం చేశాయని సీపీఎం జిల్లా కార్యదర్శి జాన్​ వెస్లీ విమర్శించారు. అసెంబ్లీ వేదికగా రాజకీయ నాయకులు ఒకరినొకరు దూషించుకోవడం కాకుండా ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలపై చర్చించాలని కోరారు. సోమవారం సూర్యాపేటలో నిర్వహించిన సీపీఎం జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

cpi meeting on urea app

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేయకుండా, కాల్వల నిర్మాణం చేపట్టకుండా, రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధన కోసం అఖిలపక్షాల ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లి కేంద్రం పై ఒత్తిడి తేవాలని అవసరమైతే పోరాటాలు చేయాలాని స్పష్టం చేశారు. పాత ఉపాధి హామీ చట్టాన్నే యథాతథంగా కొనసాగించాలని,కేంద్రం తీసుకువస్తున్న కొత్త చట్టంలో పనిదినాలను కుదించే కుట్ర దాగి ఉందని, దీనివల్ల కూలీలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు ఏమాత్రం అవగాహన లేని యూరియా యాప్ విధానాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

రైతులకు సరిగ్గా సెల్ ఫోన్లే లేవని అలాంటిది యాప్ ఎలా వినియోగిస్తారని, గిరిజన, పొడు రైతులకు యాప్ విధానం సరిపడదన్నారు. అవసరమైన మేరకు యూరియాను అందుబాటులో ఉంచాలని, యూరియా కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా స్పష్టమైన ప్రకటన చేయాలని వెస్లీ డిమాండ్ చేశారు.

Share
Share