- నాగార్జునసాగర్లో…లిక్కర్ మాఫియా !
- పెద్దవూర, నాగార్జునసాగర్, తిరుమలగిరి మండలాల్లో వ్యాపారుల పైన సిండికేట్ దౌర్జన్యం
- షాపులు తెరవకుండా అడ్డుకుంటున్న బడాబాబులు
- అధికార జులంతో అక్రమ కేసులు?
- హాలియా ఎక్సైజ్ ఆఫీసు ముందు విద్యాసాగర్ రెడ్డి నిరసన
- పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్య యత్నం
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నాగార్జునసాగర్ నియోజకవర్గంలో లిక్కర్ మాఫియా జూలు విదిల్చింది. 40 ఏళ్ల నుంచి లిక్కర్ మాఫియాను ఏలుతున్న బడాబాబుల మధ్య గొడవలు రచ్చకెక్కాయి. లిక్కర్ బిజినెస్లో ఆరితేరిన విద్యా సాగర్, ప్రసాద్ మధ్య గత కొన్నేళ్ల నుంచి కోల్డ్వార్ నడుస్తోంది. గత ఇరవై ఏళ్ల నుంచి వ్యాపార భాగస్వాములైన వీళ్లద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దాంతో సాగర్లో లిక్కర్ బిజినెస్ పైన ఆధిపత్యం చలాయించేందుకు ప్రసాద్ వర్గం తన పైన బెదిరింపులకు పాల్పడుతోందని విద్యాసాగర్ రెడ్డి సోమవారం హాలియా ఎక్సైజ్ ఆఫీసు ఎదుట పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్య చేసుకుంటానని నిర సన తెలిపారు.

విద్యాసాగర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు అధికార బలాన్ని అడ్డంపెట్టుకుని తన షాపులను లాక్కొన్నేందుకు అక్రమ కేసులు బనాయిస్తున్నాడని చెప్తున్నారు. తిరుమలగిరి(సాగర్), పెద్దవూర, నాగార్జునసాగర్లో విద్యాసాగర్ రెడ్డి, అతని పార్టనర్స్ పేర్ల మీద నాలుగు షాపులు వచ్చాయి. ఎక్సైజ్ ఆఫీసర్లు రూల్స్ మేరకు మ్యాప్లు, పర్మిట్ రూమ్స్ పరిశీలించిన అనంతరం షాపులు ఓపెన్ చేసేందుకు పర్మిషన్స్ ఇచ్చారు. కానీ ప్రసాద్ అండ్ కో సాగర్ రెడ్డి షాపులను బెదిరించి లాక్కునేందుకు ఎక్సైజ్ ఆఫీసర్లను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పారు.
కల్తీ మద్యం బిజినెస్ అడ్డొస్తరనే…
రాష్ట్ర వ్యాప్తంగా ప్రసాద్ అండ్ కో లిక్కర్ బిజినెస్లో ఎదురులేదనీ చెప్తుంటారు. అధికార పార్టీ నేతల అండదండలు కూడా ఉండటంతో టెండర్లలో షాపులు దక్కించుకున్న వ్యాపారులను ఏదోరకంగా మభ్యపెట్టి వాటిని తమ వశం చేసుకుంటారని విద్యాసాగర్ రెడ్డి చెప్తున్నారు. స్వతహాగా ప్రభుత్వ టీచర్ అయిన ప్రసాద్తో సాగర్ రెడ్డి కలిసి 20 ఏళ్ల పాటు లిక్కర్ సిండికేట్ నడిపించారు. కానీ ఆర్ధిక పరమైన అంశాల్లో విభేదాలు తలెత్తడంతో వేరుపడ్డారు. దాంతో గత నాలుగేళ్ల నుంచి సాగర్ రెడ్డి షాపుల పైన ప్రసాద్ కన్ను పడిందని, చెప్తున్నారు.
నాగార్జునసాగర్లో కల్తీ మద్యం విచ్చలవిడిగా జరుగుతుందని, దీని వెనకాల పెద్దల హస్తం ఉందని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ఇప్పుడు సాగర్ రెడ్డి సొంతంగా బిజినెస్ నడిపితే అక్రమ లిక్కర్ మాఫియాకు అడ్డొస్తడనే కారణంతో అతనికి వచ్చిన షాపులను తమ చేతుల్లోకి తీసుకోవాలనే కుట్రపన్నుతున్నారని దాంతో షాపులకు పర్మిషన్కు ఇచ్చిన రెండు, మూడు రోజుల్లోనే క్లోజ్ చేయించారని తెలుస్తోంది. గతంలో తిరుమలగిరి వైన్స్ వ్యవహారంలో ఇదేరకమైన ఇబ్బందులు గురిచేయడంతో ఎక్సైజ్ సీఐ యమునాధర్రావును ఏసీబీకి పట్టించారు. ఈ సంఘటన అప్పట్లో పెద్ద సంచలనం కలిగించింది.
నాలుగు షాపుల పైనే అటాక్…
విద్యాసాగర్ రెడ్డి అండ్ కో కు పెద్దవూరలో ఒకటి, తిరుమలగిరిలో రెండు, నాగార్జునసాగర్లో ఒక షాపు వచ్చింది. పెద్దవూరలో షాపు ఇప్పటి వరకు ఓపెన్ చేయకుండా అడ్డుపడుతున్నారు. హిల్కాలనీలో షాపు ఓపెన్ చేసేందుకు నవంబర్ 28 న పర్మిషన్ ఇచ్చి, డిసెంబర్ 1న షాపు సీజ్ చేస్తున్నట్టు నోటీసు ఇచ్చారు. ఈ షాపుకు సమీపంలో మేరీమాత విగ్రహాం ఉందని, రోడ్డు పక్కనే షాపు ఏర్పాటు చేశారని మున్సిపల్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం షాపు సీజ్ చేశారు. దాంతో విద్యాసాగర్ కోర్టు నుంచి స్టే తెచ్చుకుని మళ్లీ షాపు ఓపెన్ చేశారు. కానీ అందుకు ఆఫీసర్లు ససేమిరా ఒప్పుకోలేదు. నిజానికి ఈ షాపుకు ఎదురుగానే ప్రసాద్ సిండికేట్ కు చెందిన బార్ అండ్ రెస్టారెంట్ నడుస్తోంది. బార్కు లేని అభ్యంతరం తన షాపుకు ఎందుకు వచ్చిందని సాగర్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు.
ఇక పెద్దవూరలో ప్రధాన రహాదారికి ఆనుకుని షాపు ఏర్పాటు చేయోద్దని ఎక్సైజ్ ఆఫీసర్లు అడ్డుచెప్పడంతో ఇప్పటికీ షాపు ఓపెన్ చేయలేదు. అయితే రూల్స్ ప్రకారం ప్రధాన రహాదారికి దూరంగానే షాపు ఏర్పాటు చేయడానికి పర్మిషన్ తీసుకున్నారు. కానీ ఇదే ప్రాంతంలో ప్రసాద్ అండ్ కో షాపు పెట్టారు. ఈ షాపు రూల్స్కు వ్యతిరేకంగా మెయిన్ రోడ్డుకు అతిసమీపంలో ఉందని, దానికి లేని అడ్డంకులు తన షాపుకు ఏంటనీ సాగర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇక తిరుమలగిరి(సాగర్)లో వైన్స్ పెట్టుకునేందుకు ఇరిగేషన్ ల్యాండ్స్ తప్పా ప్రైవేటు ల్యాండ్స్ అందుబాటులో లేవు. ఇరిగేషన్ ల్యాండ్లో సాగర్ రెడ్డి షాపు పెట్టొద్దని దాన్ని తొలగించాలని కంప్లైట్ చేశారు. కానీ అదే ల్యాండ్స్లో ప్రసాద్ అండ్ కో కొన్నేళ్ల నుంచి షాపులు నడిపిస్తోందని, తన పైన దౌర్జన్యం చేసి, షాపులను చేజిక్కించుకునేందుకు అధికార బలాన్ని అడ్డంపెట్టకుని కుట్ర చేస్తున్నారని విద్యాసాగర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.