- ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అవసరమైన సాయం చేస్తా
- సంక్రాంతి లోపు సీఎం రేవంత్చే బొట్టుగూడ స్కూల్ ఓపెన్: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్లగొండ, ఏపీబీ న్యూస్: ఎంసెట్లో మంచి ర్యాంకు సాధిస్తే పై చదువులకు అవసరమయ్యే ఖర్చులన్నీ భరిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం మాడ్గులపల్లిలో నిర్మించిన కేజీబీవీ స్కూల్ను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి మంత్రి ప్రారంభించారు. రూ.64లక్షలతో నిర్మించే ప్రహారి గోడ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అమ్మాయిలు బాగా కష్టపడి చదువుకోవాలని, అబ్దుల్ కలాం చెప్పినట్లు మంచి కలలు కనడమే కాకుండా, వాటిని సాధించుకోవాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను సొంత పిల్లల్లా భావించి చదువు చెప్పాలన్నారు. నల్గొండ లో బొట్టుగూడ ప్రాథమిక పాఠశాలను ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 3 కోట్ల వ్యయంతో అధునాతన సౌకర్యాలతో నిర్మాణం చేపట్టడం జరిగిందని, సంక్రాంతి లోపు సీఎం రేవంత్ రెడ్డిచే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. పాఠశాలకు డ్యూయల్ డెస్క్ లు కావాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కోరిన మీదట ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అవసరమైన ఫర్నిచర్ ఇచ్చేందుకు మంత్రి అంగీకారం తెలిపారు.