నెత్తురోడుతున్న రోడ్లు… ప్రాణాలు తీస్తున్న అతివేగం

  • ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 547 మంది దుర్మరణం.. మరో 1332 మందికి తీవ్ర గాయాలు
  • జాతీయ, రాష్ట్ర రహాదారుల పైన ఓవర్​ స్పీడ్​ జర్నీ

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్​: జాతీయ, రాష్ట్ర రహాదారుల పైన మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం వల్ల ప్రతి ఏటా వందల కుటుంబాలు మృత్యువాత పడుతున్నాయి. వందల మంది జనాలు క్షతగాత్రులుగా మారుతున్నారు. ప్రమాదాల నివారణకు పోలీస్, రవాణా శాఖలు ఎన్నో రకాలుగా హెచ్చరిస్తున్నప్పటికీ వాహనదారుల్లో మాత్రం మార్పు కనిపించడంలేదు. మద్యం మత్తులో వాహనాలు నడపడం, ఓవర్​ టేక్​ చేయడం, స్పీడ్​ గన్స్​ను పట్టించుకోకపోవడం వల్ల నిత్యం ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా వెళ్లే జాతీయ, రాష్ట్ర రహాదారుల పైన బ్లాక్​ స్పాట్స్​ గుర్తించిన పోలీస్​ శాఖ ఆమేరకు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతోంది. ఒక్క నల్లగొండ జిల్లాలో గతేడాది 41 బ్లాక్స్​ స్పాట్స్​ గుర్తిస్తే వాటిల్లో ఈ ఏడాది పది తగ్గించారు. గుర్తించిన 30 బ్లాక్​స్పాట్స్​ వద్ద ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టారు.

విజయవాడ, హైదరాబాద్​ జాతీయ రహాదారి పైన ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుతం ఫ్లైఓవర్​ బ్రిడ్జిలు నిర్మాణంలో ఉన్నాయి. రాష్ట్ర రహాదారులైన నార్కట్​పల్లి-అద్దంకి, మాల్​ నుంచి మాచర్ల వరకు వెళ్లే దారిలో ప్రమాదాలు కంట్రోల్​ కావడం లేదు. హైవేల పైన ఉన్న ఫ్లైఓవర్​ బ్రిడ్జిల వద్ద స్పీడ్​గన్స్​ ఏర్పాటు చేశారు. 120 కి.మీలకు మించి స్పీడ్​ దాటొద్దు, కానీ చాలా మంది వాహనదాలు అవేమీ పట్టించుకోకుండా మితిమీరిన వేగంతో డ్రైవ్​ చేస్తున్నారు. ప్రమాదాల తీవ్రత తగ్గినట్టు కనిపిస్తున్నా చనిపోతున్న కుటుంబాలు, ప్రమాదాల బారిన పడి క్షత గాత్రులుగా మారుతున్న కుటుంబాల్లో విషాదం నెలకొంటుంది.

Overspeeding 2

నల్లగొండ జిల్లాలో ఈ ఏడాది 1078 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. దీంట్లో 343 మంది చనిపోగా, 725 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 10 మంది క్షతగాత్రులుగా మిగిలారు. గతేడాది అత్యంత ప్రమాదకరమైన రోడ్డు ప్రమాదాలు 366 జరిగితే ఈ ఏడాది 323 యాక్సిడెంట్స్​ జరిగాయి. మైనర్​ రోడ్డు ప్రమాదాలు 498, సాధారణ రోడ్డు ప్రమాదాలు 66 జరిగాయి. సూర్యాపేట జిల్లాలో గతేడాది 622 రోడ్డు ప్రమాదాలు జరిగితే ఈ ఏడాది 563 ప్రమాదాలు చోటు చేసుకన్నాయి. ఈ ప్రమాదాల్లో గతేడాది 278 మంది చనిపోగా, ఈ ఏడాది 204 మంది చనిపోయారు. గతేడాది 576 మంది గాయాల పాలుకాగా, ఈ ఏడాది 607 మంది గాయపడ్డారు.

కార్లు, ఆటోలు, బైక్​ల వల్ల జరిగిన ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. జాతీయ, రాష్ట్ర రహాదారుల పైన కెపాసిటీకి మించి జనాన్ని ఆటోల్లో ఎక్కించడం, ఓవర్​ స్పీడ్​తో బైక్​ల పైన జర్నీ చేయడం, అత్యాదునిక టెక్నాలజీ వచ్చిన లగ్జరీ కార్లలో జనాలు హైవేల పైన ఓవర్​ స్పీడ్​ జర్నీ చేయడం, వాహనాలను ఓవర్​ టేక్​ చేయడం వంటి తప్పిదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.

నల్లగొండ20242025
డెత్స్​390343
క్షతగాత్రులు1810
మైనర్ ​గాయాలు789725
సూర్యాపేట20242025
మొత్తం రోడ్డు ప్రమాదాల కేసులు622563
చనిపోయిన వ్యక్తులు278204
గాయాలపాలైన వారు  576607
Share
Share