- దొంగలు ఎత్తుకెళ్లిన సొమ్ము రికవరీ చేయడంలో పోలీసులు వెనకడుగు
- కోట్లలో సొమ్ములు పోగొట్టుకున్న బాధితులు..క్లూస్ దొరక్క ఫైల్స్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి
- మరోవైపు పగలు, రాత్రి దొంగల హల్చల్
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: దొంగలు ఎత్తుకెళ్లిన సొమ్ము రికవరీ చేయడంలో పోలీసులు వెనకడుగు వేస్తున్నారు. బాధితులు కోట్ల రూపాయాల సొమ్ము పోగొట్టుకుని ఎప్పుడు చేతికి వస్తుందా అని ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు పగలు, రాత్రి అనే తేడా లేకుండా దొంగలు హల్ చల్ చేస్తున్నారు. కేసుల్లో పురోగతి సాధిస్తున్నట్టు క్రైమ్ రికార్డ్స్ చెప్తున్నప్పటికీ సొమ్ము రికవరీ మాత్రం ఆశించిన స్థాయిలో చేయలేకపోతున్నారు. కొన్ని కేసుల్లో సరియైన ఆధారాలు లేవనే కారణంగా ఫైల్స్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. సీసీటీవీ ఫుటేజీలు, డిజిటల్ టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికీ పొరుగు రాష్ట్రాల దొంగలను కనిపెట్టలేకపోతున్నారు. పోలీసులు చాలెంజ్‌గా తీసుకునే కొన్ని కీలకమైన కేసుల్లో మాత్రమే ఆసక్తిచూపిస్తున్నారు తప్పా సామాన్య ప్రజలు నష్టపోయిన సొమ్మును కనిపెట్టి రికవరీ చేయడంలో మాత్రం విఫలమవుతున్నారు.
నల్లగొండ జిల్లాలో రెండేళ్లలో రూ.20 కోట్లు ఫట్..
నల్లగొండ జిల్లాలో 2024లో 700 కేసులు నమోదుకాగా, రూ.15.1 7 కోట్ల ఆస్తిని బాధితులు కోల్పోయారు. దీంట్లో కేవలం రూ.5.53కో ట్లు మాత్రమే రికవరీ చేయగలిగారు. ఇక ఈ ఏడాది 637 కేసులు నమోదుకాగా, పోగొట్టుకున్న సొమ్ము విలువ రూ.5.28 కోట్లు. దీంట్లో కేవలం రూ.3.33 కోట్లు మాత్రమే బాధితులకు తిరిగి ఇప్పించారు.
సూర్యాపేట జిల్లాలో రూ.9 కోట్లు స్వాహా…
సూర్యాపేట జిల్లాలో 2024లో 536 కేసులు నమోదుకాగా, బాధితులు పోగొట్టుకున్న సొమ్ము విలువ రూ.4.92కోట్లు. దీంట్లో 338 మంది బాధితులకు కూ.2.08కోట్లు స్వాధీనం చేసుకుని బాధితులకు ఇప్పించారు. 2025 జనవరి నుంచి డిసెంబర్ 20 వరకు 360 కేసులు నమోదు కాగా, రూ.4.03 కోట్ల సొమ్మును దొంగలు ఎత్తుకెళ్లారు. దీంట్లో 192 కేసుల్లో రూ.1.22 కోట్లు మాత్రమే రికవరీ చేయకలిగారు. ఈ రెండు జిల్లాలో కలిపి సుమారు రూ.20 కోట్ల సొమ్ము దొంగల నుంచి రికవరీ చేసి, బాధితులు ఇవ్వాల్సి ఉంది. దీంట్లో అత్యధికంగా నల్లగొండ జిల్లాలోనే ఉంది.
జిల్లాల వారీగా పోగొట్టుకున్న సొమ్ము, రికవరీ వివరాలు..
| నల్లగొండ | 2024 | 2025 |
| కేసులు | 700 | 637 |
| నష్టపోయింది | రూ.15,17,41,969 | రూ.5,28,23,560 |
| రికవరీ చేసింది | రూ.5,53,42,450 | రూ.3,33,20,575 |
| సూర్యాపేట | 2024 | 2025 |
| కేసులు | 536 | 360 |
| రికవరీ కేసులు | 338 | 192 |
| పోయిన సొమ్ము | రూ.4,92,66,194 | రూ.4,03,30,507 |
| రికవరీ చేసింది | రూ.2,08,58,167 | రూ.1,22,48,280 |