- రాష్ట్రంలో 45 శాతం స్థానాలను టచ్ చేసిర్రు
- సాగునీటి ప్రాజెక్టుల పై నల్లగొండ నుంచే రణభేరి
- పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్స్కీంను ప్రభుత్వం అడ్డుకుంటోంది
- జిల్లా మంత్రులకు ప్రాజెక్టుల పైన అవగాహన శూన్యం
- ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వని ప్రభుత్వం..సర్పంచ్లకు ఎక్కడి నుంచి తెస్తది
- నల్లగొండలో బీఆర్ఎస్ సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నల్లగొండ, ఏపీబీ న్యూస్: పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తరపున ఎవ్వరూ సహరించకపోయినప్పటికీ, కేసీఆర్ పోరాట స్పూర్తితో అధికార పార్టీ ఆగడాలు, అరాచకాలను ఎదుర్కొని అద్భుతంగా విరోచతమైన పోరాటం చేశారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం నల్లగొండలో సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ బలం, ఆయన పోరాట స్పూర్తి మీలో కనిపించిందని, ఇదే స్పూర్తితో వచ్చే ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 45 శాతం సీట్లు సాధించారని, ఇంకొంత మేర సపోర్ట్ లభిస్తే 60 శాతం టచ్ చేసేవారని కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలన పైన విజయోత్సవాల పేరిట జిల్లాల్లో పర్యటించినా, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వమని ఎమ్మెల్యేలు బెదిరించినప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా నిజాయితీగా 35,40 శాతం స్థానాలు గెలుపొందడం గొప్ప విషయమని అన్నారు. ఈ ఫలితాలను చూశాకే రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని, దాంతోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టేందుకు భయపడుతున్నారని అన్నారు. రేవంత్ సర్కార్కు దమ్ముంటే సహకార సంఘాల ఎన్నికలు పెట్టాలని, కానీ జాతీయ రైతు దినోత్సవం రోజన రైతులకు అన్యాయం జరిగేలా ప్రభుత్వం ఎన్నికలు పెట్టకుండా నామినేటెడ్ పేరుతో పదవులు భర్తీ చేయాలని చూస్తోందని చెప్పారు.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని, కేంద్రం డీపీఆర్ తిప్పిపంపిన మాట్లాడలేని తెలివి తక్కువ సీఎం రేవంత్ అని అన్నారు. నదీ జలాల అన్యాయంపై నల్లగొండ నుంచే రణబేరి మోగిస్తామని అన్నారు. నదీ జలాలపైన ప్రభుత్వానికి అవగాహన లేదని, జిల్లా సాగునీటి మంత్రిది అంతులేని అజ్ఞానమని , కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాదానం చెప్పలేక కేసుల డ్రామాలు ఆడుతున్నారన్నారు. కేసులు, బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని రెండేళ్ల నుంచి ఏది ప్రశ్నించినా లీక్ల పేరిట కేసులని పత్రికల వారి కాళ్లు పట్టుకుని తాటికాయంత అక్షరాలతో రాయిస్తున్నాడని ఎద్దేవా చేశారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి తెరచాటు రాజకీయాలు మానుకుని, పలాన కేసులో కేసు పెడుతున్నామని ప్రకటించాలని, కానీ ధైర్యం లేకనే చిట్చాట్లు, పెడ్తూ, మీడియాకు లీక్లు ఇస్తూ అబద్దాలు రాయిస్తున్నాడని విమర్శించారు.

420 హామీల భయం పట్టుకుంది….
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరు గ్యారంటీల భయం 420 హామిల భయం పట్టుకుందని, ఎన్నికలు పెట్టేందుకు ప్రభుత్వం వెనుకడుగు వేస్తుందన్నారు. గులాబి సైన్యం ప్రజాక్షేత్రంలో ప్రబుత్వాన్ని నిలదీయాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. సాగునీటి ప్రాజెక్టులపై నీళ్లపై నీళ్ల మంత్రికి కనీస అవగాహన లేదని, మరో మంత్రి వాటర్లో నీళ్లని మాట్లాడే అజ్ణానని జిల్లా మంత్రులను పరోక్షంగా ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం కేసీఆర్ గర్జిస్తుంటే సమాధానం చెప్పేదమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 90 శాతం పనులు పూర్తయ్యాయని మిగతా 10 శాతం పనులు పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.

రెండేళ్లలో 2.50 లక్షల కోట్ల అప్పు….
2014లో కేసీఆర్ సీఎం పదవి చేపట్టే నాటికి రాష్ట్రానికి రూ. 80 వేల కోట్లు అప్పు ఉందని పదేళ్లలో 2.80 లక్షల కోట్లు అప్పు చేసినట్లు స్వయంగా పార్లమెంట్లోనే సంబందిత శాఖ మంత్రి చెప్పారన్నారు. కనీస అవగాహన లేని రేవంత్రెడ్డి రూ. 8 లక్షల కోట్లని ,ఇంకో ఆయన భట్టి విక్రమార్క రూ. 7 లక్షల కోట్లని కేసీఆర్ ప్రభుత్వంపై దుష్ప్రాచారం చేసారని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో అప్పు చేసి రైతులకు రైతు బందు కింద రూ. 73 వేల కోట్లు ఇచ్చామని, రూ. 90 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు, రూ. 40వేల కోట్లతో మిషన్ భగీరథ నీరు, రూ. 20 వేల కోట్లతో మిషన్ కాకతీయ, మెడికల్ కాలేజిల నిర్మాణం, వేయికి పైగా గురుకులాలు, 15 లక్షల మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చామన్నారు. రెండేళ్లలో 2.50 లక్షల కోట్లు అప్పు చేసి రేవంత్రెడ్డి రాష్ట్రానికి ఏమి చేశాడో చెప్పమంటే ఒక్కదానికి సమాదానం లేదన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య, మాజీ ఎమ్మెల్యేలు నలమోతు భాస్కర్రావు, కంచర్లభూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, రవీంద్ర కుమార్, కంచర్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.