వివాదస్పదంగా మారుతున్న సివిల్​ సప్లై కార్పోరేషన్…

  • సివిల్​ సప్లై డీఎం గోపికృష్ణ సరెండర్​
  • స్థానికంగా ఉండట్లేదనే కారణంతో సరెండర్​ చేసిన కలెక్టర్​
  • రెండు నెలల ముందు డీఎం హారీష్​ ఆకస్మిక బదిలీ
  • వివాదస్పదంగా మారుతున్న సివిల్​ సప్లై కార్పోరేషన్​
  • తప్పించుకుంటున్న అసలు సూత్రదారులు?

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లా సివిల్​ సప్లై కార్పోరేషన్​ జిల్లా మేనేజర్లు (డీఎం)ల మార్పు వివాదస్పదంగా మారింది. రెండు నెలల వ్యవధిలోనే ఇద్దరు మేనేజర్లు మారడం వెనక ఆంతర్యం ఏంటనే సంగతి ఎవరికీ అంతుచిక్కడం లేదు. రెండు రోజుల క్రితం డీఎం గోపికృష్ణను జిల్లా కలెక్టర్​ ఇలా త్రిపాఠి డిపార్ట్మెంట్​కు సరెండర్​ చేసినట్టు తెలిసింది. ఆయన సరెండర్​ చేయడం వెనక బలమైన కారణాలు లేవని, అసలు సూత్ర దారులను తప్పించేందుకే డీఎంలను పావులా వాడుకుంటున్నారనే అభిప్రాయం డిపార్ట్మెంట్​లో వినిపిస్తోంది. ఈ సీజన్​లో వడ్లు 3.50 లక్షల టన్నులు వస్తాయని అనుకుంటే ఊహించని రీతిలో ఐదు లక్షల మెట్రిక్​ టన్నులు రావడం జరిగింది. దీనికి తోడు మొంథా తుఫాన్​ ప్రభావం రైతులను, ఆఫీసర్లను అతలాకుతలం చేసింది. క్లిష్ట పరిస్థితుల్లో జిల్లాలో డీఎం గోపికృష్ణ​ అందుబాటులో లేకపోవడం, హైదరాబాద్​ నుంచి రాకపోకలు సాగిస్తుండటం వల్ల వడ్ల కొనుగోళ్ల భారం అంతా కలెక్టర్​ పైన పడింది. ముఖ్యంగా తుఫాన్​ అప్పుడు కలెక్టర్​ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. రైతుల ఆందోళనలు, రాజకీయ ఒత్తిళ్లు, మిల్లర్ల చర్యలను కంట్రోల్​ చేయడానికి కలెక్టర్​ తీవ్రంగానే శ్రమించారు. నిజానికి జాయింట్​ కలెక్టర్​, డీఎం, డీఎస్​ఓల వడ్ల కొనుగోళ్ల వ్యవహారాన్ని సాఫీగా నడిపించడంలో ముందుండాలి. కానీ ఆఫీసర్ల మధ్య సమన్వయం లోపం వల్ల కలెక్టర్​ పైనే భారం పడింది. రెండు నెలల క్రితమే సిద్ధిపేట నుంచి జిల్లాకు వచ్చిన డీఎం గోపికృ ష్ణ రాష్ట్రంలో యూనియన్​ నాయకుడు కాగా, డిపార్ట్మెంట్​లో మంచి పేరు ఉందని, కానీ జిల్లాలో పలువురు సీనియర్ ఆఫీసర్ల తప్పులు డీఎంల మెడకు చుట్టుకున్నాయని, దాంతో రెండు నెలల వ్యవధి లోనే ఇద్దరు డీఎంలు మారినట్టు ఆఫీసులో చర్చ జరుగుతోంది.

జిల్లాలో తుఫాను వల్ల తడిసిన వడ్లను కొనుగోలు చేయడంలో అధికారుల పైన రాజకీయ ఒత్తిళ్లు తీవ్రమమయ్యాయి. మిల్లర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు పలువురు ఆఫీసర్లు తెరవెనక చక్రంతిప్పారని, డిపార్ట్మెంట్​ పరంగా డీఎంలు ఒప్పుకోకపోవడంతో జిల్లా సీనియర్​ ఆఫీసర్లు రాజకీయ ఎత్తులు ప్రయోగించి డీఎంలను ఇరికించారని, ఆ ఒత్తిడి భరించలేక రెండు నెలల క్రితం డీఎం హరీష్​ను ఆకస్మికంగా బదిలీ చేయించారని చెప్తున్నారు.  పాత డీఎం నాగేశ్వరరావు ఇక్కడి నుంచి వెళ్లిపోయాక కొత్తగా వచ్చిన హారీష్​ పైన మిల్లర్లకు అనుకూలంగా రాజకీయ ఒత్తిళ్లు తీవ్రమయ్యాయి. వడ్ల కొనుగోళ్లు సవ్యంగా సాగేందుకు పాత డీఎంను జిల్లా స్పెషల్​ఆఫీసర్​గా నల్లగొండకు రప్పించారు. కానీ పరిస్థితుల్లో మార్పురాక పోవడంతో చివరకు డీఎంల పైన వేటు పడింది.

డీఎం సివిల్​ సప్లై, పౌరసరఫరాల సంస్థ, డీఆర్​డీఏ, ప్యాక్స్​, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోళ్లు సాఫీగా సాగాల్సి ఉంది. ఈ శాఖల ఆఫీసర్లు, మిల్లర్లు, ట్రాన్స్​పోర్ట్​ కాంట్రాక్టర్లను ఎప్పటికప్పుడు సమన్వయం చేయాల్సిన బాధ్యత జాయింట్ కలెక్టర్​ పైనే ఉంది. అయితే తడిసిన వడ్లు కొనుగోలు చేయడంలో మిల్లర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు జిల్లా సీనియర్​ ఆఫీసర్లు పెద్ద హైడ్రామా ఆడారు. ఒకవైపు సెంటర్లలో తడిసిన వడ్లు కొనుగోలు చేస్తామనే రైతులను నమ్మించి, మరోవైపు మిల్లర్లతో చేతులు కలిపారు. సెంటర్ల నుంచి వడ్లు మిల్లులకు చేరాక 20 శాతం కోత పెట్టారు. దాంతో రైతులు భారీగా నష్టపోవాల్సి వచ్చింది. తెరవెనక మిల్లర్లతో జరిగిన ఈ వ్యవహారంలో డీఎం, డీఎస్ఓలను ఇరికించేందుకు ముందునుంచీ పెద్ద స్కెచ్​ వేశారు. కానీ డీఎం, డీఎస్​ఓలు ఒప్పుకోలేదని, దాంతో వారిద్దరిని ముందు పెట్టి సీనియర్ ఆఫీసర్లు మైండ్ ​గేమ్ ప్లే చేశారని, దీనివెనక పెద్ద తంతగమే నడిచిందని తెలిసింది. ఒకానొక దశలో ఆఫీసర్ల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కూడా జరిగింది. అసలు తడిసిన వడ్లు కొనుగోలు చేసేందుకు ప్రత్యేకంగా కమిటీ వేయాలని ఆఫీసర్లు చేసిన ప్రతిపాధన సైతం సీనియర్లు బుట్టదాఖలు చేశారు. ఈ వ్యవహారం వెనక భారీ స్థాయిలో డబ్బులు చేతులు మారినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీనియర్​ ఆఫీసర్లను తప్పించేందుకు డీఎంను సరెండ్​ చేశారనే వాధన వినిపిస్తోంది. ఇంకోవైపు సీనియర్​ ఆఫీసర్ల అక్రమాల పైన పైస్థాయిలో విచారణ జరుగుతోందని, దానికి సంబంధించిన కీలక ఆధారాలు కూడా ఉన్నతాధికారుల చేతికి అందాయని తెలిసింది. వడ్ల కొనుగోళ్లు చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో ఆఫీసర్ల అవతవకలు బయటపడటం కలకలం రేపుతోంది.

Share
Share