- ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, నకిరేకల్‌లో బీఆర్ఎస్తో కష్టమే
- 432 కాంగ్రెస్, 240 గ్రామాలు బీఆర్ఎస్ కైవసం
- 23 మండలాల్లో గులాబి శ్రేణుల ప్రభావం
- సొంత పార్టీ కేడర్‌ను సమన్వయం చేయడంలో ఫెయిల్
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్:
కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు పంచాయతీ ఎన్నికల్లో ఎదురుగాలి వీచింది. అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డుస్థాయి మెజార్టీ సాధించిన కొత్త ఎమ్మెల్యేలకు పల్లె ఓటర్లు గట్టిషాక్ ఇచ్చారు. కాంగ్రెస్‌కు ధీటుగా బీఆర్ఎస్ మద్ధతుదారులు గెలుపొందడం ఎమ్మెల్యేలకు అస్సలు మింగుడుపడట్లేదు. కొత్త ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందనే సంగతిని గ్రహించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మె ల్యేలు తమ మద్ధతుదారులను గెలిపించుకోవడంలో వ్యూహాత్మకంగా వ్యవహారించారు. అసలు కొన్ని చోట్ల మాజీ ఎమ్మెల్యేలు ప్రచారం చేయని గ్రామాల్లో సైతం బీఆర్ఎస్ సపోర్టర్స్ గెలవడం ఎమ్మెల్యే లను ఆశ్చర్యానికి గురిచేసింది. తొలిసారి అసెంబ్లీ ఎన్నికైన వారికి స్థానిక ఎన్నికలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. దీంతో లోకల్ ఎన్నికల వ్యూహాన్ని రూపొందించడంలో, కేడర్‌ను సమన్వయం చేయడంలో ఫెయిలైనట్టు ఎన్నికల ఫలితాలను చూస్తే తెలుస్తోంది. ఎన్నికల్లో తమ అనుచరులకు ఇచ్చిన ప్రయార్టీ గ్రామస్థాయిలో పట్టు ఉన్న పార్టీ సీనియర్లను పట్టించుకోకపోవడంతో పరోక్షంగా వారంతా బీఆర్ఎస్కు పనిచేశారు. ఓటుకు రూ.500 నుంచి రూ.2వేలకు ఖర్చు పెట్టినప్పటికీ పల్లె ఓటర్లు మాత్రం తమకు నచ్చిన అభ్యర్థినే ఎన్నుకున్నారు.
రెండేళ్లకే ఎమ్మెల్యే పైన వ్యతిరేకత:
అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఎమ్మెల్యేలు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న జిల్లాలో బీఆర్ఎస్ మళ్లీ పట్టుబిగుస్తుందనే చర్చ నడుస్తోంది. ఆలేరులో బీర్ల అయిలయ్య, భువనగిరిలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి మందుల సామేలు, నకిరేకల్ వేముల వీరేశం, మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జునసాగర్ కుందురు జైవీర్ రెడ్డి తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలు. ఈ నియోజకవర్గాల్లో ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టిపోటీ జరిగిం ది. ఏకగ్రీవమైన పంచాయతీలను మినహాయిస్తే ఎన్నికలు జరిగిన పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్ధతుదారులు సత్తా చాటారు. ముఖ్యంగా ఆలేరు, భువనగిరి, మిర్యాలగూడలో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు సాధించింది. పార్టీ సింబల్ లేకుండానే ప్రజలు ఈ రకమైన తీర్పును ఇవ్వడమంటే రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ముందస్తు హెచ్చరిక ఇచ్చినట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

కాంగ్రెస్ 432…బీఆర్ఎస్ 240
ఆరు నియోజకవర్గాల్లో 23 మండలాల్లో బీఆర్ఎస్ గట్టిపోటీ ఇచ్చింది. ఈ మండలాల్లో మొత్తం 811 పంచాయతీల్లో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 432, బీఆర్ఎస్ మద్ధతుదారులు 240 పంచాయతీల్లో గెలుపొందారు. ప్రధానంగా భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ 56 పంచాయతీలు గెలిస్తే బీఆర్ఎస్ 55 మంది గెలుపొందడం విశేషం. ఇక ఆలేరులో 87 మంది కాంగ్రెస్ సపోర్టర్స్ గెలిస్తే బీఆర్ఎస్ 50 మంది మద్ధతుదారులు గెలుపొందారు. మూడో ప్లేస్‌లో తుంగతుర్తిలో కాంగ్రెస్ 76, బీఆర్ఎస్ 40, మిర్యాలగూడలో కాంగ్రెస్ 72 గె లిస్తే, బీఆర్ఎస్ 36 గ్రామాల్లో గెలిచింది. నకిరేకల్ సెగ్మెంట్లో కాంగ్రెస్‌లో 77, బీఆర్ఎస్ 31, నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 28 మంది మద్ధతుదారులు గెలుపొందారు. ఏకగ్రీవం పోను ఎన్నికలు జరిగిన పంచాయతీల్లో సాధించిన ఫలితాలు.
23 మండలాలు ఇవీ…
తుంగతుర్తి సెగ్మెంట్లో అర్వపల్లి, నూతనకల్, మద్దిరాల, శాలిగౌరారం మండలాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు సత్తా చాటారు. అట్లాగే ఆలేరులో ఆలేరు, రాజాపేట, బొమ్మలరామారాం, ఆత్మకూరు (ఎం), యాదగిరిగుట్ట, నకిరేకల్‌లో నార్కట్‌పల్లి, కట్టంగూరు, చిట్యాల, రామన్నపేట మండలాల్లో కాంగ్రెస్‌కు ధీటుగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. భువనగిరి సెగ్మెంట్లో మొత్తం నాలుగు మండలాల్లో భువనగిరి, భూధాన్ పోచంపల్లి, బీబీనగర్, వలిగొండలో బీఆర్ఎస్, కాంగ్రెస్ చెరోసగం స్థానాలు కైవసం చేసుకున్నారు. మిర్యాలగూడలో మిర్యాలగూడ మండలం, మాడ్గులపల్లి, దామరచర్ల, సాగర్‌లో పెద్దవూర, త్రిపురారం, నిడమనూరు మండలాల్లో బీఆర్ఎస్ మెజార్టీ మద్ధతు దారులు గెలుపొందారు.
మిర్యాలగూడలో ఎమ్మెల్యే బత్తులకు షాక్…
ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో మిర్యాలగూడలో బీఆర్ఎస్ గట్టిపోటీ ఇచ్చింది. దాదాపు అన్ని మండలాల్లో బీఆర్ఎస్ మద్ధతుదారులు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ 72, బీఆర్ఎస్ 36 చోట్ల గెలుపొందగా, మరో నాలుగు పంచాయతీల్లో ‘టాస్’ వల్ల ఫలితాన్ని కోల్పోయారు. ఇంకో 28 పంచాయతీల్లో అభ్యర్థులు 20 లోపు ఓట్ల తేడాతో ఓడిపోయారు, అలాగే 70 ఓట్ల లోపు అభ్యర్ధులు 18 గ్రామ పంచాయతీల్లో ఓడిపోవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే వర్గం దాదాపు పది కోట్ల వరకు ఖర్చు పెట్టినట్టు తెలిసింది. అసలు పోటీ వద్దని చెప్పిన అడవిదేవులపల్లి గ్రామంలో సైతం కోటి రూపాయాలకు పైగా ఖర్చు చేశారు. పోలింగ్‌కు ముందు ఓటర్లకు రెండువేల చొప్పున పంపిణీ చేసినట్టు తెలిసింది. ఇంకోవైపు దామరచర్లలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ వర్గం నిలబడటంతో ఎమ్మెల్యే వర్గీయులు చాలెంజ్ తీసుకోవాల్సి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు బీఆర్ఎస్ మద్ధతుదారులను గెలిపించడంలో చాకచక్యంగా వ్యహరించారు. భువనగిరిలో మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ప్రచారం చేసిన ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ క్యాండేట్లు గెలుపొందడం విశేషం.
ఆరు సెగ్మెంట్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సాధించిన స్థానాలు (రెండు విడతల్లో)
| నియోజకవర్గం | మొత్తం జీపీలు | కాంగ్రెస్ | బీఆర్ఎస్ |
| భువనగిరి | 126 | 56 | 55 |
| ఆలేరు | 153 | 87 | 50 |
| తుంగతుర్తి | 128 | 76 | 40 |
| మిర్యాలగూడ | 134 | 72 | 36 |
| నకిరేకల్ | 102 | 77 | 31 |
| నాగార్జునసాగర్ | 148 | 64 | 28 |