టీపీసీసీ చీఫ్‌గా ఎవరిని పెట్టుతారనే ఉత్కంఠ దాదాపు ముగిసినట్టుగా ఉంది. ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేరును ఖరారు చేసినట్టుగా సమాచారం. కొత్త పీసీసీ అధ్యక్షుడిని ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో అన్ని సామాజిక వర్గాల సమీకరణాలు చూసిన తర్వాతే లక్ష్మణ్ కుమార్ పేరును ఫైనల్ చేశారని చెబుతున్నారు.
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రస్తుతము ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈయన, గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పై 22,039 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పీసీసీ చీఫ్ నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణ కూడా జరుగుతుందని తెలుస్తోంది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, అంటే గత 8 నెలలుగా, రేవంత్ రెడ్డి సీఎం పదవితో పాటు పీసీసీ చీఫ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. పీసీసీ చీఫ్‌గా ఎన్నికలకు వెళ్లి, పార్టీని అధికారంలోకి తెచ్చిన రేవంత్‌ను సీఎం పదవి వరించింది. ఆ పదవి చేపట్టినప్పటికీ పీసీసీ చీఫ్‌ను హైకమాండ్ ఇంకా ఎంపిక చేయలేదు. వివిధ కారణాలతో ఈ ఎంపిక ప్రక్రియ వాయిదా పడింది. ఆ తరువాత వెంటనే లోక్‌సభ ఎన్నికలు కూడా రావడంతో రేవంత్ నాయకత్వంలోనే కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసింది.